Ramayanam in one painting by Bapu

Ramayanam in one painting by Bapu

Monday, June 27, 2011

బాలకాండ శ్లోకాలు: 1-10 (ప్రథమ సర్గ)

తప:స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం |
నారదం పరిపప్రఛ్ఛ వాల్మీకి: మునిపుంగవం ||    (1)

మహా తపస్వీ, గొప్ప తేజో వంతుడు, మహా జ్ఞానీ ఐన నారద మహర్షిని వాల్మీకి మహర్షి ఇలా  ప్రశ్నిస్తున్నాడు. (1)

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః ||     (2)

ఈ ప్రపంచంలో సకల గుణధాముడు, సత్య వాక్య పరిపాలకుడు, కీర్తి ప్రతిష్ఠలు కలిగిన వాడు, వీరత్వము కలిగినవాడు ఎవరు?         (2)

చారిత్రేణ చ కో యుక్త: సర్వ భూతేషు కో హిత: |
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః ||   (3)

మంచి ప్రవర్తన, అన్ని జీవుల పట్ల వాత్సల్యంతో ఉండేటటువంటి వాడు, అన్ని విషయములలోనూ ప్రవీణ్యత కలిగినవాడు, అన్ని పనులను చక్కబెట్టుటకు సామర్ధ్యం కలిగినవాడు, చూడగానే అందరినీ ఆకట్టుకొనే అందం కలిగినవాడు ఎవరు?  (3)

ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయక: |
కస్యబిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ||    (4)

ఎవరైతే ఎటువంటి పరిస్థితిని ఎదురుకోవడానికైనా భయపడని వాడు, తన కోపాన్ని నిగ్రహించుకున్నవాడు, ఈర్ష అనేదే ఎరుగని వాడు, అద్భుతమైన తేజస్సు కలిగినవాడు, యుద్ధం లో పోరాడటానికి దేవతలు సైతం జంకుతారో, అతను ఎవరు?   (4)

ఏతదిఛ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే |
మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవంవిధం నరం ||     (5)

ఓ మహర్షి, మీరు సర్వజ్ఞులు కనుక మీకు ఇటువంటి వ్యక్తి ఈ ప్రపంచం లో ఎక్కడ ఉన్నారో తెలిసే ఉండాలి. దయచేసి నా కుతూహలాన్ని గ్రహించి ఈ వ్యక్తిని గురించి చెప్పండి.    (5)

శ్రుత్వా చైతత్ త్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచ: |
శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్ ||   (6)

వాల్మీకి పలికిన ఈ మాటలను విన్న త్రికాలవేది ఐన నారద మహర్షి, "ఓ వాల్మీకి మహర్షి, మీరు చెప్పిన గుణాలు కలిగిన వ్యక్తి గురించి చెబుతాను. శ్రద్ధ గా వినండి."    (6)

బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణా:  |
మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తశ్శౄయతాం నర:  ||    (7)

ఓ వాల్మీకి మహర్షి, మీరు చెప్పిన గుణాలు గొప్ప గొప్ప చక్రవర్తులకు సైతం సాధ్యం కానివి. అలాంటిది ఇన్ని గుణాలు ఒక మానవుడిలో ఉండటం దుర్లభం. ఐనా..ఇలాంటి ఒక మనిషి గురించి నాకు తెలుసు. అతని గురించి నేను ఇప్పుడు వర్నిస్తాను. శ్రద్ధగా వినండి.     (7)

ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైశ్శృత:  |
నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ  ||    (8)

ఇక్ష్వాకు వంశం లో ఆవిర్భవించిన అతను జనాలకు రాముడు గా తెలుసు. అతను, ఏ పనికైనా చాలా జాగ్రత్తతో నిర్ణయం తీసుకునేవాడు, ఎటువంటి పరిస్థితిని ఐనా సమర్ధవంతంగా, ధైర్యం తో ఎదుర్కోనేవాడు, గొప్ప తేజస్సు కలవాడు, చెడుని, చెడు చేసేవాళ్ళనీ, అదుపులో పెట్టగల సమర్ధత కలవాడు, ఇవి మాత్రమే కాక, తన ఇంద్రియాలని కూడా కట్టడి చేయగలడు.    (8)

బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణ:  |
విపులాంసో మహాబాహు: కంబుగ్రీవో మహాహను:  ||    (9)

అతను అన్ని విషయాలలోనూ చాలా ప్రవీణ్యత కలిగిన వాడు, గొప్ప జ్ఞాని, మంచి వాళ్లకు ఎప్పుడూ సహాయం చేయాలనే సంకల్పంతో ఉన్నవాడు, చెడ్డవాళ్ళని శిక్షించే వాడు. అతను ఆజానుబాహుడు. అతని కంఠం శంఖము వలె ఉండును. ఎత్తైన బుగ్గలు కలవాడు అతడు.    (9)

మహోరస్కో మహేష్వాసో గూఢజత్రురరిందమ: |
ఆజానుబాహుస్సుశిరా: సులలాటస్సువిక్రమ:  || (10)

సింహం వక్షస్ఠలము వంటి వక్షస్థలము కలిగినటువంటి వాడు, ఒత్తైన భుజములు కలిగినటువంటివాడు, అతను ఆజానుబాహుడు, బారుగా ఉండే విల్లు ఉన్నటువంటివాడు, శత్రువులను అదుపులో పెట్టినవాడు, గొప్ప చక్రవర్తి వంటి ఠీవీ కలిగినటువంటి వాడు, సింహము వంటి నడక కలిగినటువంటి వాడు అతను.     (10)