Ramayanam in one painting by Bapu

Ramayanam in one painting by Bapu

Wednesday, March 19, 2014

బాలకాండ శ్లోకాలు: 86-90 (ప్రథమ సర్గ)

దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్|
అయోధ్యాం ప్రస్థితో రామ: పుష్పకేణ సుహృద్వృత: || (86)

యుద్ధమున, తన విజయమును చూసి ప్రశంసించుటకు వచ్చిన దేవతలు వరమీయగా, ఆ వరముచే యుద్ధమున మరణించిన వానర వీరులందరినీ మరలా బ్రతికించి, రావణాసురుడు కుబేరుని వద్ద గెలిచిన పుష్పకవిమానముపై మిత్రులగు సుగ్రీవ, విభీషణులతో కలిసి రాముడు అయోధ్యకు బయలుదేరెను.

భరద్వాజాశ్రమం గత్వా రామ: సత్యపరాక్రమ:|
భరత స్యాంతికం రామో హనుమంతం వ్యసర్జయత్|| (87)

రాముడు, భరద్వాజ ముని ఆశ్రమానికి చేరి, భరద్వాజుడు రాముని నాడు అచట ఉండవలసినది అని కోరగా, తాను భరతునికి ఇచ్చిన మాత ప్రకారం వనవాసము చివరిరోజున అయోధ్యకు వెళ్లకుంటే, భరతుడు అగ్నిప్రవేశము చేసెదడని, భరతుని వారించమని హనుమంతుని భరతునివద్దకు పంపెను.

పున రాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవసహితశ్చ స:|
పుష్పకం తత్ సమారుహ్య నందిగ్రామం యయౌ తదా|| (88)

అటు పిమ్మట సుగ్రీవ విభీషణాదులతో కలిసి పుష్పక విమానమెక్కి సీతకు, తక్కినవారికి పూర్వ విశేషములను తెలుపుతూ, తాను భరతుడు ఉన్న నందిగ్రామమునకు పయనమాయెను.

నందిగ్రామే జటా హిత్వా భ్రాతృభి: సహితోనఘ:|
రామస్సీతా మనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ || (89)

రాముడు నందిగ్రామమునకు చేరుకొని, సోదరులందరినీ కలసికొని జడలను తీసెవేసి, సీతాసమేతుడై పూర్వము తన తండ్రి ఐన దశరధుడు ఇచ్చిన రాజ్యమును , వనవాసము తరువాత మరలా స్వీకరించెను.

ప్రహృష్టో ముదితో లోక  స్తుష్ట: పుష్ట: సుధార్మిక:|
నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్షభయవర్జిత: || (90)

రామవియోగముతో అలమటించిన అయోధ్యా ప్రజలు, రామ పట్టాభిషేకముతో మహదానందభరితులై, రామునకు కడు ప్రియమైన ధర్మ మార్గమును అనుసరించుచు, ఎటువంటి మానసిక, శారిరక వ్యాధులు లేనివారై, కరువు భయము లేనివారై ఆనందముగా జీవించసాగెను.

Tuesday, March 18, 2014

బాలకాండ శ్లోకాలు: 81-85 (ప్రథమ సర్గ)

తేన గత్వా పురీం లంకాం హత్వా రావణ మాహవే|
రామ స్సీతా మనుప్రాప్య పరాం వ్రీడా ముపాగమత్|| (81)

ఆ సేతుమార్గమున రాముడు లంకా నగరానికి చేరి, యుద్ధంలో రావణుని చంపి, సీతను సమీపించి, "ఇంత కాలం పరుని ఇంట ఉన్న ఈమెను స్వీకరించుట యెట్లు" అని సిగ్గుపడెను.

తా మువాచ తతో రామ: పరుషం జనసంసది|
అమృష్యమానా సా సీతా వివేశ జ్వలనం సతీ|| (82)

పిమ్మట, రాముడు జనసమూహమున సీతతో పరుషముగా మాట్లడగా, మహా పతివ్రత ఐనటువంటి సీత, పరుషమైన రాముని వాక్యములకు మిక్కిలి బాధపడి, అగ్నిప్రవేశము చేసెను.

తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం|
బభౌ రామ: సంప్రహృష్ట: పూజిత: సర్వదైవతై: || (83)

సీత అగ్నిప్రవేశము చేసిన పిమ్మట, అగ్ని పలికిన మాటలచే సీత యే దోషమునూ లేనిదని గుర్తించి, సర్వదేవతలు తన ధర్మనిరతిని పొగడగా, రాముడు ఆనందించెను.

కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం |
సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మన: || (84)

ప్రశంసార్హమగు రావణవధ చేసిన రాముని ముల్లోకములోనున్న సర్వదేవతలు, ఋషులు, అందరు ఆనందించిరి.

అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం|
కృతకృత్యస్తదా రామో విజ్వర: ప్రముమోద హ|| (85)

అటుపిమ్మట, రాముడు విభీషణుని లంకాపురిలో రాక్షసరాజుగా అభిషిక్తుని చేసి, తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుని, కృతకృత్యుడై, ఆనందించెను.

Saturday, March 15, 2014

బాలకాండ శ్లోకాలు: 76-80 (ప్రథమ సర్గ)

అస్త్రే ణోన్ముక్త మాత్మానం జ్ఞాత్వా పైతామహా ద్వరాత్ |
మర్షయన్ రాక్షసాన్ వీరో యంత్రిణ స్తాన్ యదృఛ్ఛయా || (76)
తతో దగ్ధ్వా పురీం లంకాం ఋతే సీతాం చ మైథిలీం|
రామాయ ప్రియ మాఖ్యాతుం పునరాయా న్మహాకపి: || (77)

దేవతలకు కూడా ప్రవేశించుటకు అసాధ్యమైనటువంటి లంకా నగరములోకి, అతి పరాక్రమశాలి ఐనటువంటి హనుమంతుడు, బ్రహ్మదేవుని వరముచే రాక్షసులు ప్రయోచిన బ్రహ్మాస్త్రము విడిపోయినను, రావణుని చూచుటకై, రాక్షసులు వీధులవెంట ఈడ్చుకుపోతున్ననూ, మిన్నకుండెను.అటుపిమ్మట రావణుని చూచి, మరలిపోవుచూ, సీత నివసించుచున్న వనము విడిచి, మిగిలిన లంకాపురమును తగులబెట్టి, రామునకు సీతను చూచిన శుభవార్తను తెలుపుటకు మరలెను.

సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం|
న్యవేదయ దమేయాత్మా దృష్టా సీతేతి తత్వత:|| (78)

మహాబుద్ధిమంతుడైన హనుమంతుడు, సీతావియోగమునందు కూడా, ధైర్యము వీడని రాముని దరికి జేరి, ప్రదక్షిణమాచరించి , "చూచితి సీత"నను శుభవార్తను విన్నవించెను.

తత: సుగ్రీవసహితో గత్వా తీరం మహోదధే:|
సముద్రం క్షోభయామాస శరై రాదిత్యసన్నిభై: || (79)

హనుమంతుడు, సీత యొక్క జాడను తెలిపిన పిమ్మట, రాముడు సుగ్రీవసహితుడై సముద్ర తీరమునకేతెంచెను. అచ్చట, సముద్రుడు దారి చేయకుండుతచే రాముడు కోపించి, సూర్య కాంతి పోలిన బాణములతో సముద్రుని బెదిరించెను.

దర్శయామాస చాత్మానం సముద్ర: సరితాం పతి:|
సముద్రవచనాచ్చైవ నలం సేతు మకారయత్|| (80)

నదీపతి యగు సముద్రుడు, రాముని కోపమునకు బెదిరి తన నిజరూపముతో ప్రత్యక్షమై, రాముని శరణు వేడెను. రాముదు, సముద్రునిపై దయ తలచి, తన అస్త్రాలను ఉపసమ్హరించి, నలుడను ఒక వానర శ్రేష్ఠునితో సముద్రముపై వారధి నిర్మింపజేసెను.

Thursday, March 13, 2014

బాలకాండ శ్లోకాలు: 71-75 (ప్రథమ సర్గ)

స చ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభ:|
దిశ:ప్రస్థాపయామాస దిదృక్షు:జనకాత్మజాం || (71)

వానరులందరికీ రాజైనటువంటి సుగ్రీవుడు, వానరసెనలను నలుదిక్కులకు పంపెను, జనకుని కూతురైన సీత ను వెదకుటకై.

తతో గృధ్రస్య వచనాత్ సంపాతే ర్హనుమాన్ బలీ|
శతయోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవం || (72)

అటు పిమ్మట, జటాయు యొక్క అన్నగారైన సంపాతి చెప్పిన సమాచారం విన్న, సర్వ సమర్ధుడైన హనుమంతుడు, వంద యోజనముల సముద్రమును దాటుటకు ఆకాశమునకెగసెను.

తత్ర లంకాం సమాసాద్య పురీం రావణ పాలితాం|
దదర్శ సీతాం ధ్యాయంతీం, అశోకవనికాం గతాం|| (73)

హనుమంతుడు, రావణుడు పాలించుచున్న లంకా నగరానికి చేరి, అశోక వనములో, కేవలము రామ ధ్యానములో ఉన్న సీతా మాతను చూచెను.

నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ|
సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణం|| (74)

శ్రీరాముడు తనకిచ్చిన ఉంగరమును సీతాదేవికి గుర్తుగా ఇచ్చి, రామ-సుగ్రీవ మిత్రత్వము నుంచి, వానర సైన్యమును నలుదిశలకు సీతాన్వేషణకై పంపినవరకు గల వృత్తాంతమును సీతా మాత విన్నవించి, రాముడూ త్వరలోనే వచ్చి కాపాడునని సీతామాతను ఓదార్చి, అశోక వనముయొక్క వెలుపలి ద్వారమును చూర్ణము చేసెను.

పంచ సేనాగ్రగాన్ హత్వా సప్త మంత్రిసుతా నపి|
శూర మక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్|| (75)

పిమ్మట, హనుమంతుడు రావణుని ఐగుదురు సేనాపతులను, మంత్రి సుతులేడుగురిని చంపి, పరాక్రమవంతుడైన అక్షకుమారుని హతము చేసి, ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు బద్ధుడయ్యెను.