Ramayanam in one painting by Bapu

Ramayanam in one painting by Bapu

Tuesday, March 18, 2014

బాలకాండ శ్లోకాలు: 81-85 (ప్రథమ సర్గ)

తేన గత్వా పురీం లంకాం హత్వా రావణ మాహవే|
రామ స్సీతా మనుప్రాప్య పరాం వ్రీడా ముపాగమత్|| (81)

ఆ సేతుమార్గమున రాముడు లంకా నగరానికి చేరి, యుద్ధంలో రావణుని చంపి, సీతను సమీపించి, "ఇంత కాలం పరుని ఇంట ఉన్న ఈమెను స్వీకరించుట యెట్లు" అని సిగ్గుపడెను.

తా మువాచ తతో రామ: పరుషం జనసంసది|
అమృష్యమానా సా సీతా వివేశ జ్వలనం సతీ|| (82)

పిమ్మట, రాముడు జనసమూహమున సీతతో పరుషముగా మాట్లడగా, మహా పతివ్రత ఐనటువంటి సీత, పరుషమైన రాముని వాక్యములకు మిక్కిలి బాధపడి, అగ్నిప్రవేశము చేసెను.

తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం|
బభౌ రామ: సంప్రహృష్ట: పూజిత: సర్వదైవతై: || (83)

సీత అగ్నిప్రవేశము చేసిన పిమ్మట, అగ్ని పలికిన మాటలచే సీత యే దోషమునూ లేనిదని గుర్తించి, సర్వదేవతలు తన ధర్మనిరతిని పొగడగా, రాముడు ఆనందించెను.

కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం |
సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మన: || (84)

ప్రశంసార్హమగు రావణవధ చేసిన రాముని ముల్లోకములోనున్న సర్వదేవతలు, ఋషులు, అందరు ఆనందించిరి.

అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం|
కృతకృత్యస్తదా రామో విజ్వర: ప్రముమోద హ|| (85)

అటుపిమ్మట, రాముడు విభీషణుని లంకాపురిలో రాక్షసరాజుగా అభిషిక్తుని చేసి, తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుని, కృతకృత్యుడై, ఆనందించెను.

No comments:

Post a Comment