Ramayanam in one painting by Bapu

Ramayanam in one painting by Bapu

Sunday, July 29, 2012

బాలకాండ శ్లోకాలు: 61-70 (ప్రథమ సర్గ)

చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం |
తతో వానర రాజేన వైరానుకధనం ప్రతి ||   ( 61)

రామునితో అగ్నిసాక్షిగా స్నేహమునకు అంగీకరించిన సుగ్రీవుడు, రాముడు చెప్పినదంతా విని, తనకు జరిగిన అన్యాయమును గురించి కూడా రామునికి చెప్పనారంభించెను.    ( 61)

రామాయావేదితం సర్వం ప్రణయాదు:ఖితేన చ |
ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి ||     (62)

తన సోదరుడైన వాలితో తనకు ఉన్న వైరము గురించి మొత్తం రామునకు సుగ్రీవుడు విన్నవించెను. ఈ వృత్తాంతం వినిన రాముడు, ఇన్ని దురాగతాలకు పాలుపడిన వాలిని వధించి సుగ్రీవునకు న్యాయము చేయుటకు ప్రతిజ్ఞ చేసెను.   ( 62)

వాలినశ్చ బలం తత్ర కథయామాస వానర: |
సుగ్రీవశ్శంకితశ్చాసీత్ నిత్యం వీర్యేణ రాఘవే||   (63)

ఇట్లు ప్రతిజ్ఞ చేసిన రామునితో, అక్కడ ఉన్న వానర సైన్యం వాలి యొక్క బల ప్రతాపాలను గూర్చి వివరించుటనారంభించెను. సుగ్రీవుడు, రాముని ధైర్య సాహసాలను తెలుసుకున్నను, వాలితో యుద్ధమునకు రాముడు తగిన వాడేనాయని శంకించెను.  (63)

రాఘవ ప్రత్యయార్థం తు దుందుభే: కాయముత్తమం|
దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం||   (64)

వాలియొక్క బలమును శ్రీ రామునకు నిరూపించుటకు సుగ్రీవుడు, రామునకు వాలి వధించిన దుందుభి అను రాక్షసుని  కళేబరమును చూపించెను. ఆ కళేబరము చూచుటకు పర్వతమును పోలి ఉన్నది.   (64)

ఉత్స్మయిత్వా మహాబాహు: ప్రేక్ష్య చాస్థిమహాబల: |
పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనం||  (65)

ఆ కళేబరమును చూసిన రఘురాముడు, సుగ్రీవునివైపు మందహాసముతో చూచి, ఆ కళేబరమును తన కాలి బొతనివేలితో కొట్టెను. ఆ దెబ్బకు ఆ కళేబరము పది యోజనముల దూరమ్న పడెను. ఇది చూచిన తరువాత కూడా రామునిపై సుగ్రీవునకు నమ్మకము కుదరలేదు.  ( 65)

బిభేద చ పున: సాలాన్ సప్తేకైన మహేషుణా|
గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా||  (66)

సుగ్రీవుని నమ్మకమును పెంచుటకు, రాముడు, ఒకే ఒక్క బాణంతో ఏడు సాల వృక్షములను కొట్టెను. ఆ బాణము, వృక్షములను కొట్టుటయే కాక ఒక పర్వతములోనుంచి వెళ్ళి, పాతాళ లోకంలో దాకా వెళ్ళెను.  (66)

తత: ప్రీతమనాస్తేన విశ్వస్త: స మహాకపి:|
కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తదా||   (67)

రాముడు చేసిన పనిని చూసి సుగ్రీవుడు పొంగిపోయెను. రాముడీపైన తన నమ్మకం పెరిగెను. రాముని తో స్నేహము చేసినందుకు సంతోషించి, రామునితో కలిసి కిష్కింధలో తన గుహ దెగ్గరకు బయలుదేరెను.  (67)

తతో గర్జత్ హరివర: సుగ్రీవో హేమపింగళ: |
తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వర: ||   (68)

బంగారము వంటి తేజస్సు కలిగినటువంటి సుగ్రీవుడు, కిష్కింధకు చేరగానే, గర్జన చేయుచూ, వాలిని పిలిచెను. వానర రాజైనటువంటి వాలి, తన గుహలొనుంచి బయటకి వచ్చెను.  (68)

అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగత: |
నిజఘాన చ తత్రైవం శరేణైకేన రాఘవ: ||   (69)

సుగ్రీవుని అరుపులు వినగానే, వాలి గుహనుంచి బయటకు బయలు దేరెను. కానీ,తన భార్య ఐన తార వాలిని వారించెను. సుగ్రీవుడు రామునితో వచి ఉండవచ్చునని, వరితో వైరం వాలికి మంచిది కాదు అని హెచ్చరించెను. వాలి తారను సముదాయించి, సుగ్రీవునితో యుద్ధము చేయనారంభించెను.ఆ యుద్ధము జరుగుతుండగా, వాలిని శ్రీ రాముడు ఒకే ఒక్క బాణముతో నిర్మూలించెను.  (69)

తత: సుగ్రీవవచనాత్ హత్వా వాలినమాహవే|
సుగ్రీవ మేవ తద్రాజ్యే రాఘవ: ప్రత్యపాదయత్ ||   (70)

వాలిని వధించిన తరువాత, శ్రీ రామచంద్రుడు, సురీవుని మరలా కిష్కింధకు రాజుగా పట్టాభిషేకము చేసెను.  (70)