Ramayanam in one painting by Bapu

Ramayanam in one painting by Bapu

Sunday, December 4, 2011

బాలకాండ శ్లోకాలు: 56-60 (ప్రథమ సర్గ)

తం నిహత్య మహాబాహు: దదాహ స్వర్గతశ్చ స: |
స చాస్య కథయామాస శబరీం ధర్మచారిణిం || (56)

వికృతమైన రూపం కలిగిన ఈ రాక్షసుడిని, అద్భుతమైన శక్తి గల రాముడు త్రుటిలో సంహరించెను. ఆ రాక్షసుడు, స్వర్గలోకాలకు వెడలిపోతూ, రామునితో ఇల చెప్పెను. " ఓ రామా, ఈ అరణ్యములోనే శబరి అనే ఒక గొప్ప తపస్విని ఉన్నది"   (56)

శ్రమణిం ధర్మనిపుణాం అభిగచ్చేతి రాఘవ|
సోభ్యగచ్చన్ మహాతేజా: శబరీం శత్రుసూదన: || (57)

శబరి గురించి చెప్తూ, " ఆ మహా సాధ్వి, సత్య, దయా ధర్మాలకు కట్టుబడినదియై, నిత్యమూ దైవ స్మరణముతో గడిపే మహాత్మురాలు. ఓ రామా, నీవు ఆమె ఆశ్రమానికి వెళ్ళు" అని చెప్పి, కబంధుడు అద్రుశ్యమైయ్యెను. ఈ మాటలను విన్న రామచంద్రుడు, లక్ష్మణునితో కలిసి శబరి ఆశ్రమానికి బయలిదేరెను.   (57)

శబర్యా పూజితస్సమ్యక్ రామో దశరథాత్మజ: |
పంపాతీరే హనుమతా సంగతో వానరేణ హ || (58)

దశరధాత్మజుడైన రామచంద్రుని రాక చూసి, ఆయనని ఆహ్వానించి, అతిధి మర్యాదలు చేసెను. ఆ పంపా నది సమీపంలోనే రామునికి హనుమంతునితో పరిచయమయ్యెను. (58)

హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగత: |
సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబల: || (59)

హనుమంతుని ద్వారా రామ లక్ష్మణులకు సుగ్రీవునితో పరిచయమయ్యెను. రాముడు సుగ్రీవునికి, హనుమంతునికి తన గాధనంతా వర్ణించెను.  (59)

ఆదితస్తద్యథావృత్తం సీతాయాశ్చ విశేషత: |
సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానర: || (60)

మోదటినుంచీ జరిగినదంతా వివరిస్తూ, సీతాపహరణమును వివరంగా వర్ణించెను. రాముడు చెప్పినదంతా సుగ్రీవుడు శ్రద్ధ గా విని, రామునితో స్నేహమునకు అంగీకరించెను.  (60)