Ramayanam in one painting by Bapu

Ramayanam in one painting by Bapu

Saturday, July 30, 2011

బాలకాండ శ్లోకాలు: 41-45 (ప్రథమ సర్గ)

ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవ లోచన: |
విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ హ ||  (41)

దండకారణ్యములో ప్రవేశించిన తరువాత, విరాధుడు అనే రాక్షసుడిని రామచంద్రమూర్తి సంహరించారు. అటుపిమ్మట, రాముడు, సీతా లక్ష్మణ సమేతుడై శరభంగ మహర్షి ఆశ్రమాన్ని దర్శించెను.   (41)

సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా |
అగస్త్య వచనాచ్చైవ జగ్రాహైంద్రం శరాసనం ||  (42)

సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి, అటు పిమ్మట అగస్త్య మహర్షి ఆశ్రమానికి, అగస్త్య మహర్షి తమ్ముడి ఆశ్రమానికి కూడా వారు వెళ్ళెను. అగస్త్య మహర్షి, ఇంద్రుడు ఇచ్చిన ధనుస్సును రాముడుకి ఇచ్చెను.  (42)

ఖడ్గం చ పరమప్రీత: తూణీ చాక్షయసాయకౌ |
వసతస్తస్య రామస్య వనే వనచరైస్సహ ||  (43)

ధనుస్సుతో పాటు ఒక ఖడ్గము, ధనుస్సు కొశం అక్షయ బాణ తూణీరాలను కూడ ఇచ్చెను. ఆ తూణీరములలో బాణములు ఎన్నటికీ తరగవు. ఇలా శరభంగ మహర్షి యొక్క ఆశ్రమ సమీపములో రాముడు నివసిస్తూ ఉండగా, అడవులలో నివసిస్తున్నవానప్రస్థులు రాముని వద్దకు వచ్చెను.   (43)

ఋషయో భ్యాగమమ్ సర్వే వధాయాసుర రక్షసాం |
స తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే ||  (44)

వానప్రస్థులు రాముడి వద్దకు చేరి, వనాల్లో తిరుగుతూ వారిని బాధిస్తున్న రాక్షసులను సంహరించమని కోరగా, ఏ ఏ వనాలు రాక్షసుల వల్ల బాధపడుతున్నయో ఆ ఆడవులలో ఉన్న రాక్షసులందరినీ సంహరించటానికి రాముడు అంగీకరించెను.   (44)

ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధస్సంయతి రక్షసాం |
ఋషీణామగ్నికల్పానాం దండకారణ్య వాసినాం ||  (45)

అలా అంగీకరించిన రాముడు, అడవులలో ఉండి తపస్సు చేసుకుంటున్న మహా మునులందరిని, ఎవరైతే అగ్ని వంటి తేజస్సు కలిగి ఉన్నారో, వారిని వారి తేజస్సుతో రాక్షసులను నిర్మూలించమని అడిగెను.   (45)

Saturday, July 23, 2011

బాలకాండ శ్లోకాలు: 36-40 (ప్రథమ సర్గ)

త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోబ్రవీత్ |
రామోపి పరమోదార: సుముఖస్సుమహాయశా: ||   (36)

సహజ దానగుణ శీలుడు, ఉదార స్వభావుడైన రాముడితో భరతుడు అడవులకు వచ్చి " రామా, ఈ రాజ్యానికి నువ్వొక్కడివే రాజువి. ఈ రాజ్యము దశరథ మాహారాజు గారి తరవాత నీకే చెందుతుంది" అని అన్నాడు.   (36)

న చైఛ్ఛత్పితురాదేశాత్ రాజ్యం రామో మహాబల: |
పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పున: పున: ||  (37)

ఎంత బతిమిలాడినా, తన తండ్రి గారికి ఇచిన మాట కోసం రాజ్యాన్ని వొద్దు అను భరతునితో రాముడు చెప్పాడు. ఐనా భరతుడు రాజ్యాన్ని పాలించను అని అనగా, రాముడు, తన పాదుకలను భరతునకు ఇచి, వాటిని తన
స్థానం లో ఉంచమని చెప్పెను.   (37)

నివర్తయామాస తతో భరతం భరతాగ్రజ: |
స కామమనవాప్యైవ రామపాదావుపస్పృశన్ ||  (38)

సింహాసనం మీద పాదుకలను ఉంచి రామాజ్ఞగా రాజ్యాన్ని పాలించమని భరతునకు చెప్పెను. భరతుడు, తన కోరిక తీరనందుకు బాధపడి, రామ పాదుకలకు నమస్కరించి, వాటిని తన శిరస్సున ధరించి బయలుదేరెను.    (38)

నందిగ్రామే కరోద్రాజ్యం రామాగమనకాంక్షయా |
గతే తు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియ: ||   (39)

భరతుడు, అడావులను వదిలి వెళ్ళి, అయోధ్యకు వెళ్ళకుండా నందిగ్రామములోనే నివసిస్తూ, రామ పాదుకలను రాజుగారి స్థానంలో ఉంచి, రామాజ్ఞగా రాజ్యాన్ని పాలిస్తూ, రాముడు ఎప్పుడు అయోధ్యకు తిరిగి వస్తాడో అని ఎదురుచూస్తూ ఉన్నాడు.   (39)

రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ |
తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశ హ ||  (40)

చిత్రకూటంలో రాముడు ఉన్న సంగతి భరతుడి వలన రాజ్యంలో ఉన్న ప్రజలకు తెలిస్తే అందరు తన ఆశ్రమానికి వచ్చేస్తారని గ్రహించి, వాళ్ళు రాకపోయినా భరతుడే మళ్ళీ రావొచ్చని, తన ఆశ్రమాన్ని మర్చుకోవాలను నిర్ణయించుకున్నాడు.    (40)

Saturday, July 16, 2011

బాలకాండ శ్లోకాలు: 31-35 (ప్రథమ సర్గ)

చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ |
రమ్యమావసథం కృత్వా రమమాణా వనే త్రయ: ||  (31)

ఈ ప్రయాణంలో భరద్వాజుని ఈశ్రమము చేరుకుని, ఆయన ఆజ్ఞచే చిత్రకూట పర్వతానికి చేరుకున్నారు. ఆ పర్వతము మీద ఒక సుందరమైన కుటీరము లక్ష్మణుడు నిర్మించెను. అయోధ్యలో ఎంత ఆనందంగా ఉన్నారో, ఈ కుటీరంలో కూడా అంతే ఆనందంగా రాముడు, సీతా, లక్ష్మణుడు ఆ ఆశ్రమం లో గడిపారు.   (31)

దేవగంధర్వసంకాశాస్తత్ర తే న్యవసన్ నుఖం |
చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా ||  (32)

అమితోత్సాహంతో ఆ ముగ్గురు, ఆనందంగా ఆ కుటీరంలో గడుపుతున్నారు. ఐతే రాముడు అడవులకు వెడలిపోయాడని దశరథ మహారాజు పుత్రశోకంలో మునిగిపోయాడు.    (32)

రాజా దశరథ: స్వర్గం జగామ విలపన్ సుతం |
మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠప్రముఖైర్ద్విజై: || (33)

తన ప్రియ పుత్రుడైన రాముడు అడవులకు వెల్లిపోయాడని విలపించి దశరథ మహారాజు దు:ఖంతో శరీరాన్ని విడిచిపెట్టేశారు. తండ్రి గారు వెళ్ళిపొగానే, అన్నగారైన రాముడు కూడా లేనందున, రాజ్య భారమును వశిష్ఠాది మహర్షులు తమ్ముడైన భరతునకు అప్పగించారు.     (33)

నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబల: |
స జగామ వనం వీరో రామపాదప్రసాదక: ||   (34)

భరతుడు, రాజ్యాన్ని పాలించడానికి తగిన సమర్ధత కలిగినవడైనప్పటికి, తన అగ్రజుడైన రాముడు లేని రాజ్యం తనకు అఖ్ఖరలేదు అని వశిశ్ఠాదులకు చెప్పి, అన్నగారైనటువంటి రాముడితో ఉండటానికి అడవులకు బయలుదేరాడు.   (34)

గత్వా తు స మాహాత్మానం రామం సత్యపరాక్రమం |
అయాచత్ భ్రాతరం రామం ఆర్యభావపురస్కృత: ||   (35)

భరతుడు అడవులకు చేరుకుని, సత్యపరాక్రమవంతుడైన రాముడి పాదాలచెంత చేరి, ఇలా ప్రాధేయపడుతునాడు.    (35)

Friday, July 8, 2011

బాలకాండ శ్లోకాలు: 26-30 (ప్రథమ సర్గ)

భ్రాతరం దయితో భ్రాతు: సౌభ్రాత్రమనుదర్శయన్ |
రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమాహితా ||  (26)

ఒక తమ్ముడు, తన అన్న పట్ల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి, రాముడితోపాటు అడవులకు బయలుదేరిన లక్ష్మణుడు తన తల్లి ఐన సుమిత్ర కి ఆనందం కలిగించాడు. రాముడి ప్రియ భార్య ఐన సీత కూడా ఆయనతో అడవులకు బయలుదేరినది.(26)

జనకస్య కులే జాతా దేవమాయేన నిర్మితా |
సర్వలక్షణసంపన్నా నారీణాముత్తమా వధూ: ||  (27)

జనకుని వంశం లో పుట్టినది, దేవతలచేత సృష్టించబడినదా అన్నంత మెరిసిపోయేటి శరీరము కలది, ఆడవారికి ఉండవలసిన అన్ని ఉత్తమ లక్షణాలు కలిగినది, రాముడికి తగిన భార్య సీత.  (27)

సీతాప్యనుగతా రామం శశినం రోహిణీ యథా |
పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ ||    (28)

చంద్రుడిని అనుసరించేటటువంటి రోహిణి వలే, సీత రాముడితో అడవులకు బయలుదేరెను. వనవాసమునకు రాముడు బయలుదేరి వెడలుతుండగా, రాజ్య ప్రజలు, చివరకు తన రండ్రి ఐన దశరథ మాహారాజు కూడా వారివెనుక కొంత దూరం వెంట వెళ్ళెను.  (28)

శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ |
గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియం ||  (29)

కొంతదూరం ప్రయాణం చేసాక, రాముడు, సీత, లక్ష్మణుడు, రథ సారథి ఐన సుమంత్రుడు, గంగా నది ఒడ్డున గల శృంగిబేరపురములో, రామ భక్తుడైనటువంటి గుహుని వద్దకు చేరుకున్నారు.   (29)

గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా |
తే వనేన వనం గత్వా నదీస్తీర్త్వా బహూదకా: ||  (30)

గుహునితో కలుసుకొనిన రాముడు, సీత, లక్ష్మణుడు, దశరథ మహారాజు మంత్రి ఐనటువంటి సుమంత్రుడిని, రథాన్ని విదిచి, పదవలో నదిని, తరువాత వచ్చే ఎన్నో వనాలను దాటుటకు వెళ్ళెను.  (30)

Thursday, July 7, 2011

బాలకాండ శ్లోకాలు: 21-25 (ప్రథమ సర్గ)

యౌవరాజ్యేన సంయోక్తుమైచ్చత్ప్రీత్యా మహీమతి:  |
తస్యాభిషేకసంబారాన్ దృష్ట్వా భార్యాథ కైకయీ  ||    (21)

ఇటువంటి ఎన్నో మంచి లక్షణాలు కలిగిన శ్రీ రాముడికి, దశరథ మహారాజు యువరాజ పట్టాభుషేకం చేయాలని సంకల్పించి తగిన సంబారాలన్ని మొదలుపెట్టించాడు. ఇవి చూసిన దశరథుని చిన్న భార్య ఐన కైకేయి, దశరథుడు తనకొసగిన రెండు వరములు కోరెను.   (21)

పూర్వం దత్తవరా దేవీ వరమేనమయాచత |
వనవాసం చ రామస్య భరతస్యాభిషేచనం ||    (22)

దశరథుడు పూర్వం తనకు ఒసగిన రెండు వరములను ఇప్పుడు కావాలని కోరినది. ఈ రెండు వరాలు ఏమనగా, పదునాలుగేళ్ళు రామ వనవాసము, కైకేయి పుత్రుడైన భరతునకు పట్టాభిషేకము.    (22)

స సత్యవచనాద్రాజా ధర్మపాశేన సంయుత: |
వివాసయామాస సుతం రామం దశరథ: ప్రియం ||   (23)

కైకేయికి ఇచ్చిన మాటకోసం, సత్యము, ధర్మము అనే బంధాలతో కట్టబడిన దశరథ మహారాజు, తన ప్రియాతి ప్రియమైన పెద్ద కొడుకైన రాముడిని అడవులకు పంపెను.    (23)

స జగామ వనం వీర: ప్రతిజ్ఞామనుపాలయన్ |
పితుర్వచననిర్దేశాత్ కైకేయ్యా: ప్రియకారణాత్ ||   (24)

తన తండ్రి కైకేయికి ఇచ్చిన మాట వ్యర్ధం కాకుండా ఉండటం కోసం, తన తండ్రికి అసత్యవాది అనే అపనింద రాకుండా ఉండటం కోసం, సవతి తల్లి ఐనా కన్న తల్లిని ప్రేమించినంతగా ప్రేమించిన కైకేయిని ఆనందింపజేయడం కోసం, బహు ధైర్యశాలి ఐన రాముడు అడవులకు వెడలెను.    (24)

తం వ్రజంతం ప్రియో భ్రాతా లక్ష్మనోనుజగామ హ |
స్నేహాద్వినయసంపన్న: సుమిత్రానందవర్ధన: ||    (25)

రాముడి పట్ల తనకున్న సహజమైన భాతృప్రేమ వలన, అన్నగారి పట్ల మర్యాద వలన, రాముడి తమ్ముడైన లక్ష్మణుడు, తన అన్నగారి వెంట ఆనందముగా అడవులకు బయలుదేరెను.   (25)

Tuesday, July 5, 2011

బాలకాండ శ్లోకాలు: 16-20 (ప్రథమ సర్గ)

సర్వదాభిగతస్సద్భి: సముద్ర ఇవ సింధుభి: |
ఆర్యస్సర్వసమశ్చైవ సదైకప్రియదర్శన: ||    (16)

భూమి మీద ఉన్న నదులకు సముద్రము ఎల ఐతే సమాశ్రయముగా ఉన్నదో, అలాగే రాముడు కూడా మంచి వారికి, శరణు వేడే వారికి సర్వకాలములయందు ఆశ్రయముగా ఉంటాడు, అందరినీ సమానముగా చూసేటటువంటి అలవాటు కలిగిన వాడు, చూడగానే అందరినీ ఆకర్షించేటటువంటి అందం కలిగినవాడు.     (16)

స చ సర్వగుణోపేత: కౌసల్యానందవర్ధన: |
సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ ||  (17)

ఏ పని చేసినా, తన తల్లి ఐన కౌసల్యా దేవి కి ఆనందాన్ని తెచ్చేవాడు, సముద్రము వలే విశాలమైన జ్ఞానము కలవాడు, ఆత్మ స్థైర్యంలో హిమాలయమువంటివాడు.     (17)

విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన: |
కాలాగ్నిసదృశ: క్రోధే ల్షమయా పృథివీసమ: ||   (18)

విష్ణువుతో సమానమైనటువంటి వీర్యం కలిగినటువంటి వాడు, పౌర్ణమి చంద్రుడి వలే అందమైన వర్చస్సు కలిగినవాడు, కాలాగ్నితో సమానమైనటువంటి క్రోధం కలిగినటువంటివాడు, కాని సహనంలో పృథివితో సమానమైనటువంటివాడు.     (18)

ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపర: |
తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం || (19)

దానగుణంలో, ఐశ్వర్యంలో స్వయంగా కుబేరునితో సమానమైనటువంటి వాడు. నిజాయితీలో, సాక్షాత్తు ధర్మస్వరూపం, ఇలాంటి సద్గుణాలు కలిగిన రాముడికి, సత్యమే అతిపెద్ద ఆయుధం.    (19)

జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథస్సుతం |
ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతిప్రియకామ్యయా ||   (20)

అణువణువునా రాజ్య సంరక్షణ, ప్రజా క్షేమమే ధ్యేయముగా కలవాడు, దశరధునకు కడు ప్రియమైన వాడు జ్యేష్ఠ కుమారుడైన శ్రీ రఘురాముడు.    (20)

Saturday, July 2, 2011

బాలకాండ శ్లోకాలు : 11-15 (ప్రథమ సర్గ)

సమస్సమవిభక్తాంగ: స్నిగ్ధవర్ణ: ప్రతాపవాన్ |
పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణ: ||     (11)

అతను మధ్యస్తమైన పొడవుతో ఉన్నవాడు, అన్ని అవయవములు సమముగా ఉన్నవాడు, దృఢమైన వక్షస్థలము కలవాడు, వెడల్పైన కన్నులు కలవాడు, శరీరమంతా మెరిసిపోతూ ఉంటుంది, ఇటు వంటి మహా గుణములు కలిగిన అతని శరీరము మహా తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది.     (11)

ధర్మజ్ఞస్సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రత: |
యశశ్వీ జ్ఞానసంపన్న: శుచిర్వశ్యస్సమాధిమాన్ ||     (12)

ధర్మాన్ని ఎన్నడూ అతిక్రమించనటువంటి వాడు, సత్యవాక్య పరిపాలకుడు, ఎల్లవేళలా రాజ్యమునందున్న ప్రజల సంక్షేమమే ముఖ్యోద్దేశముగా కలవాడు, రాజ్యం గురించి తీసుకు12)నే నిర్ణయాలలో అతిజాగ్రత్త తీసుకునే వాడు, రాజు, పేద అనే తారతమ్యం లేకుండా అందరినీ మర్యాదతో చూసేవాడు, ప్రవర్తనలో ఎటువంటి లోటు లేని వాడు, ఇంద్రియ నిగ్రహణ కలవాడు మరియు ఎటువంటి పనినైనా అవలీలగా సాధించగల సత్తా ఉన్నటువంటివాడు, ఇటువంటి అద్భుతమైన గుణాలు కలిగి ఉంటాడు అతడు.     (12)

ప్రజాపతిసమశ్శ్రీమాన్ ధాతా రిపునిషూదన: |
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా ||    (13)

సాక్షాత్తు బ్రహ్మ తో సమానమైనటువంటి తేజస్సు, ఐశ్వర్యం కలిగినటువంటి వాడు, రాక్షసులను సమ్మూలముగా నిర్మూలించేటటువంటి వాడు, రాజ్యం లోని సర్వ జీవులను పరిరక్షించడమే ముఖ్యోద్దేశముగా కలవాడు అలాగని ధర్మాన్ని విడిచిపెట్టినవాడు కాడు రాముడు. స్వకార్యమైనా, రాచకార్యమైనా ధర్మాన్ని అతిక్రమించకుండా సాధించగలిగిన సమర్ధత కలిగినవాడు. ఇలా ధర్మాన్ని తప్పకుండా ప్రవర్తించడమే దాన్ని పరిరక్షించడముతో సమానము.    (13)

రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా |
వేదవేదాంగతత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠిత: ||   (14)

ఆయన తన ధర్మాన్ని అతిక్రమించకుండా, తన ప్రజలకు ఆదర్శం గా నిలిచి, వారికి కూడా ధర్మాన్ని అనుసరించే ప్రవర్తించాలని బోధించేవాడు. ఇలా అనుక్షణం ధర్మాన్ని రక్షిస్తూనే ఉంటాడు. అతను వేదవేదాంగాలు తెలిసినవాడు. ధనుర్వేదంలో అత్యంత ప్రావీణ్యత కలిగినటువంటి వాడు.

సర్వశాస్త్రార్థతత్వజ్ఞ: స్మృతిమాన్ ప్రతిభానవాన్ |
సర్వలోకప్రియస్సాధు: అదీనాత్మా విచక్షణ: ||  (15)

సర్వ శాస్త్రాలూ, వేదాలు తెలిసినటువంటివాడు, సర్వ జనులకూ ప్రీతిపాత్రుడు, రాజ్యంలో ఉన్న ప్రజలనందరినీ సమానముగా చూసేటటువంటివాడు, ఒకరిపట్ల పక్షపాతముతో ప్రవర్తించే అలవాటు లేనటువంటివాడు. ఎవరిదెగ్గర ఎంత మర్యాదతో ప్రవర్తించాలో తెలిసినటువంటివాడు.