Ramayanam in one painting by Bapu

Ramayanam in one painting by Bapu

Wednesday, March 19, 2014

బాలకాండ శ్లోకాలు: 86-90 (ప్రథమ సర్గ)

దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్|
అయోధ్యాం ప్రస్థితో రామ: పుష్పకేణ సుహృద్వృత: || (86)

యుద్ధమున, తన విజయమును చూసి ప్రశంసించుటకు వచ్చిన దేవతలు వరమీయగా, ఆ వరముచే యుద్ధమున మరణించిన వానర వీరులందరినీ మరలా బ్రతికించి, రావణాసురుడు కుబేరుని వద్ద గెలిచిన పుష్పకవిమానముపై మిత్రులగు సుగ్రీవ, విభీషణులతో కలిసి రాముడు అయోధ్యకు బయలుదేరెను.

భరద్వాజాశ్రమం గత్వా రామ: సత్యపరాక్రమ:|
భరత స్యాంతికం రామో హనుమంతం వ్యసర్జయత్|| (87)

రాముడు, భరద్వాజ ముని ఆశ్రమానికి చేరి, భరద్వాజుడు రాముని నాడు అచట ఉండవలసినది అని కోరగా, తాను భరతునికి ఇచ్చిన మాత ప్రకారం వనవాసము చివరిరోజున అయోధ్యకు వెళ్లకుంటే, భరతుడు అగ్నిప్రవేశము చేసెదడని, భరతుని వారించమని హనుమంతుని భరతునివద్దకు పంపెను.

పున రాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవసహితశ్చ స:|
పుష్పకం తత్ సమారుహ్య నందిగ్రామం యయౌ తదా|| (88)

అటు పిమ్మట సుగ్రీవ విభీషణాదులతో కలిసి పుష్పక విమానమెక్కి సీతకు, తక్కినవారికి పూర్వ విశేషములను తెలుపుతూ, తాను భరతుడు ఉన్న నందిగ్రామమునకు పయనమాయెను.

నందిగ్రామే జటా హిత్వా భ్రాతృభి: సహితోనఘ:|
రామస్సీతా మనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ || (89)

రాముడు నందిగ్రామమునకు చేరుకొని, సోదరులందరినీ కలసికొని జడలను తీసెవేసి, సీతాసమేతుడై పూర్వము తన తండ్రి ఐన దశరధుడు ఇచ్చిన రాజ్యమును , వనవాసము తరువాత మరలా స్వీకరించెను.

ప్రహృష్టో ముదితో లోక  స్తుష్ట: పుష్ట: సుధార్మిక:|
నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్షభయవర్జిత: || (90)

రామవియోగముతో అలమటించిన అయోధ్యా ప్రజలు, రామ పట్టాభిషేకముతో మహదానందభరితులై, రామునకు కడు ప్రియమైన ధర్మ మార్గమును అనుసరించుచు, ఎటువంటి మానసిక, శారిరక వ్యాధులు లేనివారై, కరువు భయము లేనివారై ఆనందముగా జీవించసాగెను.

No comments:

Post a Comment