Ramayanam in one painting by Bapu

Ramayanam in one painting by Bapu

Monday, October 24, 2011

బాలకాండ శ్లోకాలు: 51-55 (ప్రథమ సర్గ)

న విరోధో బలవతా క్షమో రావణ తేన తే |
అనాదృత్య తు తద్వాక్యం రావణ: కాలచోదిత: ||  (51)

"ఓ రావణా, రామునితో వైరము నీకు అంత మంచిది కాదు. రాముని ధైర్య సాహసాలను తక్కువ అంచనావేసి నీ పతనాన్ని కొనితెచ్చుకోకు. నీ సహోదరి ఐన శూర్పణఖ మాటలు విని రామునితో యుద్ధానికి వెళ్ళిన మన పదునాలుగువేల మంది రాక్షసులను రాముడు అవలీలగా హతమార్చాడు. రామునితో వైరము నీకు కూడా అదే పరిస్థితిని తెచ్చిపెడుతుంది." ఇంతగా రావణాసురుడిని హెచ్చరించినా, మారిచుని మాటలను పెడచెవిన పెట్టాడు రావణాసురుడు.   (51)

జగామ సహమరీచ: తస్యాశ్రమపదం తదా |
తేన మాయావినా దూరం అపవాహ్య నృపాత్మజౌ ||  (52)

ఇలా రావణుడు, మారీచుని వెంట పెట్టుకుని రాముని ఆశ్రమానికి వెళ్ళెను. అక్కడ, రాజ కుమారులైన రామ లక్ష్మణులను, మారీచుని మాయచేత అడవిలోనికి పంపివేసెను.  (52)

జహార భార్యాం రామస్య
గృధ్రం హత్వా జటాయుషం |
గృధ్రం చ నిహతం దృష్ట్వా
హృతాం శ్రుత్వా చ మైథిలీం ||  (53)

రామ లక్ష్మణులను ఆశ్రమానికి దూరంగా పంపివేశాక, రావణాసురుడు సీతను అపహరించి తీసుకుపోతుండగా, జటాయు రావణాసురుని బారినుండి సీతను కాపాడుటకు ప్రయత్నించెను. ఆ ప్రయత్నంలో జటాయు తీవ్రంగా గాయపడెను. సీతను రావణాసురుడు అపహరించెనన్న వార్త రామచంద్రమూర్తి జటాయువు ద్వారా తెలుసుకొనెను. (53)

రఘవశ్శోకసంతప్తో విలలాపాకులేంద్రియ: |
తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషం ||  (54)

సీతను రావణాసురుడు అపహరించెనన్న వార్త విని, రామచంద్రమూర్తి ఎంతో విలపించెను. తన ప్రాణానికి ప్రాణమైన భార్య తననుంచి దూరమైందన్న బాధతో రాముడు చాల విలపించెను. కొంత తేరుకున్న తరువాత, సీతను కాపాడుటకై ప్రయత్నించి తన ప్రాణాలను విడిచిపెట్టిన జటాయుకు రాముడు అంత్యక్రియలు చేసెను.  (54)

మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శ హ|
కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం ||  (55)

జటాయువుకు అంత్యక్రియలు చేసిన పిమ్మట, రామ లక్ష్మణులు సీతను వెతుకుతూ అడవులలోకి వెళ్ళెను. ఇలా అడవులలో తిరుగుతుండగా ఒక ఘోరమైన రూపం కలిగిన కబంధుడనే రాక్షసుడిని రామ లక్ష్మణులు చూసెను.  (55)

No comments:

Post a Comment